టీడీపీకి షాక్‌: వైఎస్సార్‌సీపీలో చేరిన కరణం వెంకటేశ్‌

 


సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కరణం వెంకటేశ్‌తోపాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు.







ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వెంకటేశ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనపై అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చీరాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను మంచి మెజారిటీతో  గెలిపిస్తామని అన్నారు.